Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రకృతి సేద్యంలో ఏపీ నంబర్ 1, 25 లక్షల మంది రైతులు లక్ష్యం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Says AP Number 1 In Natural Farming With 25 Lakh Farmers Target
Advertisement
  • ప్రకృతి సేద్యంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానం
  • రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులను భాగస్వాములను చేయడమే లక్ష్యం
  • రసాయనాలతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47 శాతం పెరిగిన రైతుల ఆదాయం
  • రసాయన ఎరువుల వాడకం తగ్గించినందుకు కేంద్రం నుంచి రూ.218 కోట్ల ప్రోత్సాహకాలు
  • జీవామృతం తయారీ కోసం రాష్ట్రంలో మరిన్ని గోకులాలు నిర్మిస్తామని వెల్లడి
Advertisement
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకృతి సేద్యం, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎండీఎస్‌)పై ఆయన శనివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, రైతులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2016లో కేవలం 40 వేల మంది రైతులతో ప్రారంభమైన ఈ ప్రస్థానం నేడు 17.73 లక్షల మందికి చేరిందన్నారు. కొందరు గతంలో ఇది విజయవంతం కాదని దుష్ప్రచారం చేసినా, రైతులు అద్భుతమైన ఫలితాలు సాధించారని కొనియాడారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణించి, సాగు ఖర్చులు పెరిగి రైతులకు భారం అవుతోందన్నారు. కానీ ప్రకృతి సేద్యం ద్వారా పెట్టుబడి వ్యయం తగ్గి ఆదాయం గణనీయంగా పెరుగుతోందని వివరించారు.

"రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు సగటున 47 శాతం మేర ఆదాయం పెరిగింది. పత్తి పంటలో 96 శాతం, కందుల్లో 87 శాతం నికర ఆదాయం లభించింది. తీవ్రమైన కరవు పరిస్థితులను సైతం తట్టుకుని ఈ విధానంలో మంచి దిగుబడులు వస్తున్నాయి," అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి సాగు విధానాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యంలో గుజరాత్ కంటే ఏపీ ముందంజలో ఉందని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రశంసించారని గుర్తుచేశారు.

గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం 2.28 శాతం తగ్గిందని, దీనికి గాను కేంద్రం నుంచి రావాల్సిన రూ.218 కోట్ల ప్రోత్సాహకాల కోసం ఇప్పటికే లేఖ రాశామని చంద్రబాబు వెల్లడించారు. ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించేందుకు అనంతపురం జిల్లాలో 10 లక్షల పంట కుంటలు, చెక్ డ్యామ్‌లు తవ్వించామని, నదుల అనుసంధానంతో వర్షాభావ పరిస్థితులను కూడా అధిగమించవచ్చని అన్నారు. కషాయం, జీవామృతం తయారీకి అవసరమైన దేశీయ ఆవుల కోసం మరిన్ని గోకులాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి సేద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న రైతులే తనకు అసలైన స్ఫూర్తి అని, వారి కృషి అభినందనీయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Chandrababu Naidu
Natural Farming Andhra Pradesh
AP Agriculture News
PMKSY Schemes AP
Sustainable Farming India
Atchannaidu Minister

More Telugu News